మహానటి సావిత్రి బయోపిక్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాతో మంచి హిట్ అందుకున్న నాగ్ అశ్విన్ తన రెండవ సినిమానే సవాల్ గా తీసుకొనే సావిత్రి జీవితాన్ని వెండితెరపై అవిష్కరించబోతున్నాడు. ఈ యువ దర్శకుడు సావిత్రి కథ కోసం ఎంతో మంది ప్రముఖులను కలిసాడట. ముఖ్యంగా అమెరికలో ఉన్న సావిత్రి కొడుకుని నాగ్ అశ్విన్ ప్రత్యేకంగా కలిసి సావిత్రి జీవితంలోని కీలక విషయాలను గురించి తెలుసుకున్నాడట. 

కొన్ని రోజుల వరకు పాత్రలను ఎంపిక చేసే పనిని పూర్తి చేసిన చిత్ర యూనిట్ ప్రస్తుతం శరవేగంగా  షూటింగ్ పనులను జరుపుకుంటోంది. గత నెల రోజులుగా గోదావరి పరిసర ప్రాంతాల్లో అందమైన లొకేషన్స్ లో సావిత్రి జీవితంలోని కీలక సన్నివేశాలను  షూట్ చేశారు. ముఖ్యంగా అంతర్వేది లో ఎక్కువగా షూటింగ్ జరిపారని తెలుస్తోంది. అయితే ఇప్పుడు అక్కడ చిత్రీకరణకు ముగించుకొని పాలకొల్లు కి షిఫ్ట్ అయ్యారు. అక్కడి షెడ్యూల్ లో చిత్రానికి అనుగుణంగా కొన్ని సెట్స్ వేయనున్నారని టాక్.

ఇక సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ కనిపించబోతున్న సంగతి తెలిసిందే. ఆమె సావిత్రి పాత్రలో చాలా బాగా నటిస్తోందని చిత్ర యూనిట్ చెబుతోంది. ఇక జెమిని గణేషన్ పాత్రలో దుల్కర్ సల్మాన్ నటిస్తుండగా జర్నలిస్ట్ గా సమంత ఓ పాత్ర చేస్తోంది. అలాగే ప్రకాశ్ రాజ్ తో పాటు రీసెంట్ గా షాలిని పాండే కూడా షూటింగ్ లో జాయిన్ అయ్యింది. మొత్తానికి సినిమా పాత్రలన్నింటిని దర్శకుడు ఫైనల్ చేసేశాడు. వైజయంతి బ్యాన్నర్ లో ఈ చిత్రం తెలుగు- తమిళ్ లో ఒకేసారి తెరకెక్కుతోంది.