ప్రస్తుతం  సినీ ఇండస్ట్రీల్లో మల్టీ టాలెంటెడ్ స్టార్స్ చాలా మందే ఉన్నారు . ముఖ్యంగా హీరోలు యాక్షన్ సీన్స్ తోనే కాకుండా అప్పుడపుడు తెరవెనుక పాటలు పాడి అభిమానులను మరింత మెప్పిస్తున్నారు. ఇక హీరోయిన్స్ మేమేమి తక్కువ కాదని అందంతోనే కాకుండా ఆకట్టుకునే గాత్రంతోను పాడేస్తున్నారు. ప్రస్తుతం టాలీవుడ్ లో అలాంటి వారు చాలా మందే ఉన్నారని చెప్పాలి.

వారిలో బ్యూటిఫుల్ గర్ల్ రాశిఖన్నా కూడా ఉంది. గతంలో జోరు సినిమాలో టైటిల్ సాంగ్ పాడి మంచి ప్రశంసలను అందుకుంది. ఆ తర్వాత పలు షోలలలో సినీ వేడుకల్లో తన వెరైటీ వాయిస్ ని వినిపించి అందరిచేత క్లాప్స్ కొట్టించుకుంది. అయితే చాలా రోజుల తర్వాత అమ్మడు మళ్లీ తన వాయిస్ తో మ్యాజిక్ చేయడానికి సిద్ధమైంది. సాయి ధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కుతోన్న జవాన్ సినిమాలో రాశి ఖన్నా ఉర్రుతలూగించే ఒక పాటను పాడింది . ఈ చిత్ర సంగీత దర్శకుడు థమన్ కూడా రాశిని ఏరికోరి మరీ  ఈ పాటను స్పెషల్ గా పాడించాడట. ఇంతకుముందు పలువురు హీరోలతో థమన్ పాడించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే స్థాయిలో  రాశి ఖన్నా పాడిన  పాటకు అద్భుతమైన బాణీలను అందించాడట థమన్.
ఈ సినిమా ఒక్కటే కాకుండా.. అమ్మడు బాలకృష్ణుడు సినిమాలో కూడా ఒక పాట పాడినట్లు తెలుస్తోంది. మణిశర్మ డైరక్షన్లో ఈ సినిమా కోసం తన టెరిఫిక్ వాయిస్ తో మ్యాజిక్ చేసిందట. ఈ విషయాన్ని సీక్రెట్ గా ఉంచాలని అనుకున్నా కూడా.. రాశి ఖన్నా మాత్రం చెప్పేసింది.