ప్రియాంక చోప్రా ఇప్పుడు ఈ పేరు వింటే గుర్తుచ్చేది మాత్రం హాలీవుడ్. ఒకప్పుడు బాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరు. మిగతా స్టార్ హీరోయిన్లకు ఆమెకు పెద్దగా తేడా కనిపించేది కాదు. దీపికా పదుకొనే.. కత్రినా కైఫ్ లాంటి వాళ్లు ఆమె కంటే ఒక మెట్టు పైనే కనిపించేవాళ్లు. కానీ ఇప్పుడు ప్రియాంక రేంజే మారిపోయింది. అమెరికన్ టీవీ సిరీస్ ‘క్వాంటికో’లో నటించడం.. ఒకట్రెండు హాలీవుడ్ సినిమాల్లోనూ మెరవడంతో ఆమె స్థాయి చాలా పెరిగిపోయింది. ఇప్పుడు బాలీవుడ్ దర్శక నిర్మాతలకు ఆమె దొరికే పరిస్థితి లేదు. దొరికినా భారీగా.. మిగతా హీరోయిన్ల కంటే మిన్నగా పారితోషకం పుచ్చుకోవాల్సిందే. ఆమె రేంజ్ ఏంటన్నది ఇప్పుడు న్యూ ఇయర్ వేడుకల్లో భాగంగా ఒక అవార్డుల కార్యక్రమంలో డ్యాన్స్ చేయడానికి తీసుకున్న పారితోషకంతోనే అర్థమవుతోంది.

ప్రతి ఏడాదీ న్యూ ఇయర్ వేడుకల సమయంలోనే జీటీవీ వాళ్లు అవార్డుల కార్యక్రమం కూడా చేస్తారు. అందులో బాలీవుడ్ తారలు నృత్యం చేస్తారు. ఈసారి కత్రినా కైఫ్.. పరిణీతి చోప్రా లాంటి వాళ్లతో పాటు ప్రియాంక చోప్రా కూడా ఈ వేడుకల్లో డ్యాన్స్ చేయబోతోంది. ఐతే వాళ్ల పారితోషకానికి.. ఈమె పారితోషకానికి చాలా తేడా ఉంది. ఐదు నిమిషాలు డ్యాన్స్ చేయడానికి ఏకంగా ఐదు కోట్లు పుచ్చుకుంటోందట ప్రియాంక. అంటే నిమిషానికి కోటి రూపాయల ఆర్జన అన్నమాట. ప్రియాంక డిమాండ్ ఎలాంటిదో చెప్పడానికి ఇంతకంటే రుజువేముంది..? ఈ విషయంలో హీరోలు సైతం ప్రియాంకను చూసి కుళ్లుకోవాల్సిందే కదా?