స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ డీజే తరువాత కాస్త సైలెంట్ అయ్యాడు , కానీ దసరా నుంచి మరోసారి హల్ చల్ చేయబోతున్నాడు. అవును.. బన్నీ కొత్త సినిమా హంగామా దసరా నుంచే మొదలుకానుంది. వక్కంతం వంశీని దర్శకుడిగా పరిచయం చేస్తూ నా పేరు సూర్య అనే సినిమా చేస్తున్నాడు అల్లు అర్జున్. ఈ సినిమా ఫస్ట్ లుక్ ను దసరాకు రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారు.

నా పేరు సూర్య సినిమాకు సంబంధించి టైటిల్ లోగో ఇప్పటికే విడుదలైంది. మూవీ ప్రారంభం రోజునే టైటిల్ వచ్చేసింది. ఇక మిగిలింది ఫస్ట్ లుక్ మాత్రమే. ఈ సినిమా కోసం బన్నీ కొత్తగా ముస్తాబయ్యాయి. ఫారిన్ ఫిట్ నెస్ ట్రయిలర్ పర్యవేక్షణలో సరికొత్తగా మేకోవర్ అయ్యాడు. వీలైతే దసరాకు ఆ నయా లుక్ విడుదలయ్యే ఛాన్స్ ఉంది.

ప్రస్తుతం అన్నపూర్ణ స్టుడియోలో షూటింగ్ జరుపుకుంటోంది ఈ సినిమా. ఈనెల 24 నుంచి 15 రోజుల పాటు ఊటీలో మరో షెడ్యూల్ ఉంటుంది. వచ్చే ఏడాది ఏప్రిల్ 27న నా పేరు సూర్య సినిమాను రిలీజ్ చేయబోతున్నారు.

మూవీలో బన్నీ సరసన అను ఎమ్మాన్యుయేల్ హీరోయిన్ గా నటిస్తోంది. విశాల్-శేఖర్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. సీనియర్ నటులు అర్జున్, శరత్ కుమార్ ఈ సినిమాలో 2 కీలకపాత్రలు పోషిస్తున్నారు.