టాలీవుడ్ లో ప్రస్తుతం మెహరీన్ హవా సందడి నడుస్తోంది,’కృష్ణగాడి వీర ప్రేమగాధ’ తర్వాతి సినిమా ‘మహానుభావుడు’ రిలీజ్‌ అవడానికి మధ్యలో కొంత గ్యాప్‌ వచ్చినా  ఇప్పుడు మెహరీన్‌కి అస్సలేమాత్రం తీరిక లేదు. ఓ వైపు సినిమా షూటింగులు, ఇంకో వైపు సినిమాల ప్రమోషన్లు.. వెరసి, కంటి మీద కునుకు కూడా కష్టమైపోతోంది . మొన్న దసరా సందర్భంగా ‘మహానుభావుడు’, ఆ వెంటనే ‘రాజా ది గ్రేట్‌’, ఇప్పుడేమో ‘కేరాఫ్‌ సూర్య’, ఆ తర్వాత లైన్‌లో ‘జవాన్‌’.. ఇదీ మెహరీన్‌ సినిమాల సందడి.

ఈ స్థాయిలో మెహరీన్‌ దూకుడు ప్రదర్శిస్తోంటే, ఆమె గ్లామర్‌కి ఎప్పుడో ఫిదా అయిపోయిన అభిమానులు ఊరుకుంటారా.? పవన్‌కళ్యాణ్‌ అభిమానులు ‘పవనిజం’తో ఊగిపోతున్నట్లుగా, మెహరీన్‌ అభిమానులూ ‘మెహరీనిజం’ ప్రదర్శించేస్తున్నారు. ట్విట్టర్‌లో మెహరీనిజం అనే పేరుతో ఓ అకౌంట్‌ రన్‌ అవుతోంది. మెహరీన్‌ అభిమానులంతా ఈ అకౌంట్‌లో ఓ రేంజ్‌లో సందడి చేసేస్తుండడం గమనార్హం. తన కోసం అభిమానులు చేస్తోన్న ఈ ప్రయత్నం మెహరీన్‌ని కూడా బాగానే ఎట్రాక్ట్‌ చేసేసినట్టుంది.

తెలుగు, తమిళ భాషల్లో మెహరీన్‌కి ఇప్పుడు ఫాలోవర్స్‌ బాగా పెరిగిపోయారు. బాలీవుడ్‌లోనూ ఓ సినిమా చేసినా, సౌత్‌లోనే ఈ బ్యూటీకి ఫాలోవర్స్‌ ఎక్కువ. టాలీవుడ్‌ సంగతేమోగానీ, కోలీవుడ్‌లో అభిమానం కొత్త పుంతలు తొక్కేస్తుంటుంది. గుడి కట్టేయడం అక్కడ చాలా చిన్న విషయం. ఏమో, ముందు ముందు మెహరీనిజం ముదిరి పాకాన పడితే, మెహరీన్‌కి ఆమె అభిమానులు గుడి కట్టేస్తారేమో.! ఏమాటకామాటే చెప్పుకోవాలంటే మెహరీన్‌ వరుస ఆఫర్లే కాదు, వరుస సక్సెస్‌లూ సొంతం చేసుకుంటూ గోల్డెన్‌ బ్యూటీ అన్పించేసుకుంటున్నందున ఆమెపై ఈ స్థాయి అభిమానం వింతేమీ కాకపోవచ్చు.