దిల్ రాజు నిర్మించిన ‘ఫిదా’ మూవీ తెలుగులో ఎంత పెద్ద హిట్టయిందో అందరికీ తెలిసిందే. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి తెలుగు ప్రేక్షకుల నుండి మంచి స్పందన వచ్చింది. ఈ ఒక్క సినిమాతో హీరోయిన్ సాయి పల్లవి టాలీవుడ్లో స్టార్ హీరోయిన్ అయిపోయింది.

కాగా… నిర్మాత దిల్ రాజు ఇప్పటి వరకు తెలుగు సినిమాలకు మాత్రమే పరిమితం అయ్యారు. త్వరలో ఆయన బాలీవుడ్లో సినిమా చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ‘ఫిదా’ చిత్రాన్ని బాలీవుడ్లో రీమేక్ చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచన చేస్తున్నారట.

బాలీవుడ్లో నేటివిటీ మార్చి తీస్తారట .తెలుగులో ‘ఫిదా’ చిత్రం తెలంగాణ నేటివిటీతో తెరకెక్కించారు.

ఇదే నేటీవిటీ తీసుకుని బాలీవుడ్లో తీస్తే వర్కౌట్ అవ్వడం కష్టం. అందుకే నేటివిటీని మార్చి అక్కడ ఈ చిత్రాన్ని తీయబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది.

పంజాబీ నేపథ్యం
పంజాబీ అమ్మాయి ప్రేమకథగా ‘ఫిదా’ చిత్రాన్ని హిందీలో తెరకెక్కించే ప్రయత్నం చేయబోతున్నారట. బాలీవుడ్లో ‘ఫిదా’కు సూటయ్యే హీరోయిన్ ను ఎంపిక చేసి, మంచి లవర్ బాయ్ లాంటి హీరోతో ఈ సినిమా చేసే ఆలోచన ఉందట.

ఇంకా ప్రతిపాదన దశలోనే
అయితే ‘ఫిదా’ బాలీవుడ్ ఆలోచన ఇంకా ప్రతిపాదనల దశలోనే ఉందని…. ఇది ఫైనల్ అవుతుందో? లేదో? ఇప్పుడే చెప్పడం కష్టం అంటున్నారు దిల్ రాజు సన్నిహితులు.

దిల్ రాజు ఆశ అదే…
తెలుగులో దిల్ రాజు నిర్మాతగా కావాల్సినంత పేరు సంపాదించారు. అయితే తెలుగుకే పరిమితం కాకుండా హిందీతో పాటు ఇతర ఇండియన్ భాషల్లో కూడా సినిమాలు తీయాలనే ఆలోచనలో ఉన్నారట. మరి దిల్ రాజు ప్రయత్నం ఫలించాలని ఆశిద్దాం.